- హైదరాబాద్‌కు మల్క కొమరయ్య, నల్గొండకు అంజిరెడ్డి ఇన్‌చార్జీలు
- ఐదు కార్పొరేషన్ల సమన్వయానికి సీనియర్లతో కమిటీలు
- గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదుపై 27న వర్క్‌షాప్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో త్వరలో జరగనున్న గ్రాడ్యుయేట్, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు బీజేపీ సన్నద్ధమవుతోంది. రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలతో పాటు ఐదు మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కమలదళం కసరత్తు ప్రారంభించింది. బుధవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు అధ్యక్షతన సన్నాహక సమావేశం జరిగింది.
ఈ భేటీలో ఎన్నికల వ్యూహాలు, క్షేత్రస్థాయి కార్యాచరణ, ఓటర్ల నమోదుపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ స్థానాలతో పాటు ఐదు కార్పొరేషన్లకు ఇన్‌చార్జీలను పార్టీ నాయకత్వం నియమించింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి హైదరాబాద్ సెగ్మెంట్‌కు టీచర్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్యను, నల్గొండ సెగ్మెంట్‌కు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డిని ఇన్‌చార్జీలుగా నియమించారు.
అలాగే ఐదు మున్సిపల్ కార్పొరేషన్లకు సీనియర్ నేతలతో సమన్వయ కమిటీలను ఖరారు చేశారు. హైదరాబాద్ కార్పొరేషన్‌కు చింతల రాంచంద్రారెడ్డి, సైబరాబాద్ కార్పొరేషన్‌కు వీరేందర్ గౌడ్, మల్కాజిగిరి కార్పొరేషన్‌కు ప్రేమేందర్ రెడ్డి, ఖమ్మం కార్పొరేషన్‌కు మనోహర్ రెడ్డి, వరంగల్ కార్పొరేషన్‌కు కాసం వెంకటేశ్వర్లు నేతృత్వంలో కమిటీలను ఏర్పాటు చేశారు. అలాగే, ఈ నెల 27న గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదుపై రాష్ట్రస్థాయి వర్క్‌షాప్ నిర్వహించనున్నారు. ఆ తర్వాత జిల్లాలవారీగా ప్రత్యేక వర్క్‌షాపులు ఏర్పాటు చేసి కేడర్‌కు దిశానిర్దేశం చేయనున్నారు.
సమన్వయంతో సాగాలి: రాంచందర్ రావు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు మాట్లాడుతూ.. నాయకులు, కార్యకర్తలు అంతర్గత విభేదాలు పక్కనపెట్టాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని, ప్రజా వ్యతిరేకత ఓట్లను మలచుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా పక్కా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలన్నారు.
విద్యారంగానికి ప్రధాని మోదీ పెద్దపీట
రాజకీయాలు అంటే కేవలం ఎన్నికలు, ఓట్ల వేట మాత్రమే కాదని.. సమాజ హితం కోసం నిస్వార్థంగా సేవ చేయడమే రాజకీయాలకు అసలైన పరమార్థమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు చెప్పారు. ప్రజాప్రతినిధి ఆలోచనల్లో ప్రజాసేవ అంతర్భాగం కావాలని, సమాజానికి మేలు చేసినప్పుడే నిజమైన సంతృప్తి, సంతోషం లభిస్తాయన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాప్రతినిధిగా 25 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా బీజేవైఎం ఆధ్వర్యంలో బుధవారం నాగోల్‌లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాంచందర్ రావు శిబిరాన్ని ప్రారంభించి, స్వయంగా రక్తదానం చేశారు. తెలంగాణవ్యాప్తంగా ఏకంగా 25 వేల మంది యువతీయువకులు రక్తదానం చేసేందుకు ముందుకు రావడం అభినందనీయమని ప్రశంసించారు.
కార్యక్రమంలో ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్సీ మల్క కొమురయ్య, బీజేపీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గౌతంరావు, వీరేందర్ గౌడ్, ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్లు, బండ కార్తీకరెడ్డి, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుందే, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్క యశస్వీ, కార్యదర్శి భరత్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
